Actor Prakash Raj, which was basically shared by others. It was not my opinion and does not amount to defamation, said by Mysuru- Kodagu MP Pratap Simha. He called for press meet in Mysuru after Prakash Rai filed defamation case for 1 rupee against Pratap Simha.
సమాజంలో బహుబాష నటుడు ప్రకాష్ రాజ్ పరువుకు ఉన్న విలువ ఒక్క రూపాయి, ఈ విషయం స్వయంగా ఆయనే అంగీకరించారు, ఇక ఆయన ప్రతిష్ట గురించి కొత్తగా తాను చెప్పేది ఏమి లేదని కర్ణాటకలోని మైసూరు-కొడుగు లోక్ సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా అన్నారు. ప్రకాష్ రాజ్ కు ఒక్క రూపాయికి మించిన విలువ సమాజంలో లేదని బహిరంగంగా ఆయనే అంగీకరించారని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఎద్దేవ చేశారు.
ప్రకాష్ రాజ్ సినిమాలల్లో విలన్ గా బాగా నటిస్తారని.వెండి తెరమీద ప్రకాష్ రాజ్ ను చూసిన సినీప్రేక్షకులు ఆయన విలనిజంతో అసహ్యించుకుంటారని, నిజజీవితంలో కూడా ప్రకాష్ రాజ్ ప్రజల పాలిట విలన్ గా తయారైనాడని అయన అన్నారు.
తన పరువుకు భ౦గం కలిగించేలా బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా సోషల్ మీడియాలో వరుసగా ఆరోపణలు చేశారని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మైసూరు కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగిందని పత్రాప్ సింహా నుంచి ఒక్కరూపాయి నష్టపరిహారం ఇప్పించాలని ప్రకాష్ రాజ్ కోర్టులో మనవి చేశారు.
పరువు నష్టం దావా విషయంపై బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా బుధవారం మైసూరులో మీడియా సమవేశం ఏర్పాటు చేసి ప్రకాష్ రాజ్ మీద మండిపడ్డారు. ప్రకాష్ రాజ్ విలువ ఒక్క రూపాయి అని ఆయనే స్వయంగా కోర్టులో అంగీకరించారని, ఒక్కరూపాయి కాకపోతే పావలా (రూ. 25 పైసలు)కు వేసుకోవాలని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఎద్దేవ చేశారు.
సినిమాల్లో ఒక్కోపాత్రకు ఒక్కో పేరు పెట్టుకుంటున్న ప్రకాష్ రాజ్ నిజ జీవితంలో ఊరికి ఒక పేరు పెట్టుకుని తిరుగుతున్నారని ప్రతాప్ సింహా ఆరోపించారు. ప్రకాష్ రాజ్ గురించి తేజస్విని అనే మహిళ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను తాను షేర్ చేశానని, అంతే కాని నేరుగా తాను ఎప్పుడూ ప్రకాష్ రాజ్ మీద ఆరోపణలు చెయ్యలేదని, కోర్టు వివరణ కోరితే కచ్చితంగా సమాధానం ఇస్తానని చెప్పారు.